తెలంగాణ, పెద్దపల్లి. 29 జూలై (హి.స.)
బయోమెట్రిక్ విధానం ద్వారా వైద్య
సిబ్బంది హాజరు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం వారు మంథని మండలంలో విస్తృతంగా పర్యటించారు. మంథని పట్టణ కేంద్రంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మాత శిశు ఆసుపత్రి, గోపాలపూర్ గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గద్దెలపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో వార్డులను క్షుణ్ణంగా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగుల కోసం నూతనంగా నిర్మించిన షెడ్ను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసుపత్రిలో సిబ్బంది, వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని, ప్రతిరోజూ తప్పనిసరిగా హాజరు వివరాలను బయోమెట్రిక్ విధానం ద్వారా నమోదు చేయాలని సూచించారు. మాత శిశు ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్యసేవలను గర్భిణీ మహిళలకు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు