తిరుమల, 3 ఆగస్టు (హి.స.)తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ స్వామివారికీ వాహన సేవలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారనే అంచనాతో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ సీవీ అండ్ ఎస్వో శ్రీ మురళీకృష్ణ విజిలెన్స్, ఫైర్, ఎస్పీఎఫ్ అధికారులతో తిరుమలలోని అన్నమయ్య భవన్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పించనున్నారు. దీంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అంతేకాదు బ్రహ్మోత్సవాల సందర్భంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తిరుమలలోని ప్రతి ప్రాంతంపై నిఘా ఉంచుతూ టెక్నాలజీని వినియోగించి భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో ముఖ్య రోజులైన పెద్దశేష వాహనం, గరుడ వాహనం, రథోత్సవం, చక్రస్నానం రోజుల్లో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి