అమరావతి, 7 ఆగస్టు (హి.స.)
విశ్రాంత ఐపీఎస్ అధికారి రఘువీర్‌రెడ్డి ()పై వచ్చిన అభియోగాలపై దర్యాప్తునకు విచారణాధికారిని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఇంటెలిజెన్స్ ఐజీ రామకృష్ణను విచారణాధికారిగా, అనంతపురం డీఐజీ షిమునిని ప్రజెంటింగ్ ఆఫీసర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. రఘువీర్‌రెడ్డిపై నమోదైన అభియోగాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొనంది.
2024 ఎన్నికల సమయంలో నంద్యాల ఎస్పీగా రఘువీర్‌రెడ్డి పనిచేశారు. ఎన్నికల ప్రచారం వేళ నంద్యాల వైకాపా అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డిని ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ కలిశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటన, భారీ ర్యాలీకి అనుమతించారని రఘువీర్‌రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. అదే రోజు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు పర్యటన ఉండగా పోటీగా వైకాపా ర్యాలీకి అనుమతించినట్లు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. శాంతిభద్రతల సమస్య సృష్టించేలా వ్యవహరించారంటూ అప్పట్లోనే నాటి ఎన్నికల అధికారులు కేసు పెట్టారు. వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తూ నిబంధనలకు తూట్లు పొడిచారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రఘువీర్‌రెడ్డిపై వచ్చిన అభియోగాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ