డిల్లీ, 7 ఆగస్టు (హి.స.)దేశవ్యాప్తంగా విమానాశ్రయాలకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ మధ్య ఈ ప్రమాదం ఉండటంతో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) అడ్వైజరీ జారీ చేస్తూ, దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలను హై అలర్ట్‌లో ఉంచింది.
అంతేకాకుందా అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించింది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు ఉన్నట్టు సమాచారం అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు, విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణీకులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నట్టు బీసీఏఎస్ వెల్లడించింది. అందరి ఐడీ కార్డులను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. విమానాశ్రయం మొత్తం నిరంతర పర్యవేక్షణకు సీసీటీవీలను అనుక్షణం పనిచేసేలా చూడాలని వివరించింది. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించే ఆ సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలని ప్రయాణీకులకూ సూచించింది. విమానాశ్రయాల్లో సిబ్బంది, కాంట్రాక్టర్లు, సందర్శకుల ఐడీ కార్డులను కూడా కచ్చితంగా పరిశీలించాలి. స్థానిక పోలీసులు, సీఐఎస్ఎఫ్, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇతర ఏజెన్సీలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేసింది. అందిన నిఘా వివరాలు లేదా హెచ్చరికలను వెంటనే సంబంధిత అధికారులందరితోనూ పంచుకోవాలి. రన్వేలతో పాటు హెలీప్యాడ్స్, ఫ్లయింగ్ స్కూల్స్, శిక్షణా కేంద్రాల్లోనూ భద్రత పెంచాలని బీసీఏఎస్ తెలిపింది. ఈ అడ్వైజరీతో అన్ని విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు, రాష్ట్ర పోలీసులతో సహా అన్ని భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ, దేశీయ రూట్లలో పార్శిళ్లను కూడా సోదా చేస్తున్నారు. ఇప్పటికే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్‌ను యాక్టివేట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి