పిఠాపురం, 19 సెప్టెంబర్ (హి.స.)
,:కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామ శివారులో అక్రమంగా వచ్చిన ఎరువుల లారీలను విజిలెన్స్, వ్యవసాయాధికారులు పట్టుకున్నారు. వాస్తవానికి సహకార సొసైటీలకు, ప్రైవేటు డీలర్లకు నేరుగా ప్రభుత్వమే యూరియాను స్థానిక వ్యవసాయశాఖ సమన్వయంతో సరఫరా చేస్తోంది. కానీ ఇక్కడ వ్యవసాయశాఖ అధికారులకు తెలియకుండానే సరుకు నేరుగా వచ్చేసింది. తాటిపర్తి నాగదుర్గా ఏజెన్సీస్, దుర్గా సరస్వతి ట్రేడర్స్‌కు కోనసీమ జిల్లా ద్వారపూడి ప్రాంతం నుంచి ఈ స్టాకు వేర్వేరుగా లారీల్లో వచ్చినట్లు సమాచారం. ఒక లారీలోని సరుకును మార్గమధ్యంలోనే దించి, ఒక్కోబస్తా రూ.400పైబడి విక్రయించగా, కొనుగోలుదారులు ఆటోలు, ట్రాక్టర్లు, మోటార్‌సైకిళ్ల ద్వారా పట్టుకుపోయారు. యూరియా నిల్వలను నిర్దేశించిన ప్రాంతాల్లో కాకుండా, అక్రమ రవాణా, బ్లాక్‌మార్కెట్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విజిలెన్సు, వ్యవసాయ అధికారులు నిర్ధారణకు వచ్చారు. రెండు లారీలతోపాటు అందులో ఉన్న 548 బస్తాల యూరియాను బుధవారం అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు. నాగదుర్గా ఏజెన్సీస్ అధినేత దాసం శ్రీనివాస్, హెల్పర్ కర్రెడ్ల కనకవీరబాబు, డ్రైవర్లు కొటారి రాంబాబు, గుత్తుల దుర్గారావులపై కేసు నమోదు చేశామని.. వారిని అరెస్టు చేస్తామని పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు. నాగదుర్గా ఏజెన్సీస్ లైసెన్స్ కూడా రద్దు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ