అమరావతి, 20 సెప్టెంబర్ (హి.స.) ఏపీలోని దుకాణాలు, ఫ్యాక్టరీలు, ఇతర వాణిజ్య సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పనివేళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రోజువారీ పని గంటలను పెంచుతూ, మహిళలకు రాత్రి షిఫ్టులకు అనుమతినిస్తూ ప్రవేశపెట్టిన సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు 'ఏపీ దుకాణాలు, సంస్థల సవరణ బిల్లు-2025', 'ఫ్యాక్టరీస్ సవరణ బిల్లు-2025'లను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సభలో ప్రవేశపెట్టగా, అవి ఆమోదం పొందాయి.
కొత్త నిబంధనల ప్రకారం, దుకాణాలు మరియు ఇతర సంస్థల్లో రోజువారీ పని గంటలను 8 నుంచి 10 గంటలకు పెంచారు. ఫ్యాక్టరీలలో ప్రస్తుతం ఉన్న 9 గంటల పని సమయాన్ని కూడా 10 గంటలకు సవరించారు. అయితే, వారానికి మొత్తం పని గంటల పరిమితిని 48 గంటలుగానే యథాతథంగా కొనసాగించారు. దీంతో పాటు ఉద్యోగుల ఓవర్‌టైమ్ పరిమితిని కూడా గణనీయంగా పెంచారు. గతంలో మూడు నెలలకు 75 గంటలుగా ఉన్న ఓవర్‌టైమ్ పరిమితిని ఇప్పుడు 144 గంటలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ కొత్త సవరణల్లో భాగంగా మహిళల రాత్రిపూట షిఫ్టులపై ఉన్న ఆంక్షలను ప్రభుత్వం సడలించింది. ఇకపై మహిళలు తమ అంగీకారంతో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా విధుల్లో పాల్గొనవచ్చు. అయితే, రాత్రి షిఫ్టులలో పనిచేసే మహిళా ఉద్యోగులకు పూర్తి భద్రతతో పాటు ఇంటి నుంచి కార్యాలయానికి సురక్షిత రవాణా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా యాజమాన్యాలదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఫ్యాక్టరీలలో పనిచేసే ఉద్యోగులకు ప్రతి ఆరు గంటల పనికి అరగంట విరామం తప్పనిసరిగా ఇవ్వాలని, విశ్రాంతితో కలిపి వారి మొత్తం పని సమయం రోజుకు 12 గంటలు మించరాదని బిల్లులో పేర్కొన్నారు. 20 మంది కంటే తక్కువ సిబ్బంది ఉన్న చిన్న సంస్థలకు కొన్ని నిబంధనల నుంచి మినహాయింపులు కల్పించినప్పటికీ, కీలకమైన భద్రతా నియమాలను మాత్రం తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి