రాష్ట్రంలో 66.57 లక్షల మంది విద్యార్థులకు 'తల్లికి వందనం' సాయం: మంత్రి లోకేశ్‌
అమరావతి, 23 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ''తల్లికి వందనం'' పథకం కింద ఇప్పటివరకు 66,57,508 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందించినట్లు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. ఈ పథకం అమలు తీరు, నిధు
లోకేశ్‌


అమరావతి, 23 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం కింద ఇప్పటివరకు 66,57,508 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందించినట్లు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. ఈ పథకం అమలు తీరు, నిధుల వినియోగంపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన మంగళవారం సుదీర్ఘంగా సమాధానమిచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ, పథకం పేరు 'అమ్మఒడి' కాదని, 'తల్లికి వందనం' అని వైసీపీ సభ్యులు గుర్తుంచుకోవాలని సూచించారు. పథకం కింద ఇస్తున్న నగదు నుంచి రూ.2 వేలు తగ్గించడంపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ఆ మొత్తాన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, పరిశుభ్రత, నిర్వహణ కోసం వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు.

'తల్లికి వందనం' పథకానికి సంబంధించి తాము కొత్తగా ఎలాంటి నిబంధనలు పెట్టలేదని, గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 300 యూనిట్ల విద్యుత్ వాడకం, భూమి పరిమితి, ఆప్కాస్ ఉద్యోగుల నిబంధనలనే కొనసాగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నాలుగేళ్లు మాత్రమే, అదీ చివరి ఏడాది రూ.500 కోత పెట్టి రూ.13,000 ఇచ్చిందని, తమ కూటమి ప్రభుత్వం మాత్రం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏటా పూర్తి సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.

కొంతమంది విద్యార్థులకు నగదు జమ కావడంలో జరుగుతున్న జాప్యంపైనా లోకేశ్‌ వివరణ ఇచ్చారు. ఒకటో తరగతి విద్యార్థులకు అపార్ ఐడీ వచ్చాక, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయ్యాక నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఎస్సీ విద్యార్థులకు కేంద్రం వాటా కూడా కలిపి ఇవ్వాల్సి ఉన్నందున కొంత సమయం పడుతోందని చెప్పారు. పథకం అమలులో ఏవైనా పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, సమస్యలుంటే వాట్సాప్ ద్వారా తమ దృష్టికి తీసుకురావచ్చని సూచించారు.

పారిశుద్ధ్య కార్మికులకు ఇప్పటికే ఈ పథకం నుంచి మినహాయింపు ఇచ్చామని లోకేశ్‌ తెలిపారు. అలాగే, అర్హులైన ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు కూడా తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేసే అంశాన్ని కేబినెట్‌లో చర్చించి త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande