హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.) భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన మూసీ నది శాంతించింది. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కు వరద తగ్గింది. దీంతో మూసీలోకి వదిలే నీరు కూడా తగ్గుముఖంపట్టింది. ఈ నేపథ్యంలో మూసీ నదిలో వరద ఉధృతి తగ్గిపోయింది. దీంతో చాదర్ ఘాట్ లోయర్ బ్రిడ్జి కింది నుంచి వరద వెళ్తున్నది. అయితే వంతెనపై చెత్త, మట్టి చేరడంతో బురదమయమయింది. దీంతో బ్రిడ్జిపై నుంచి వాహనాలు ఇంకా అనుమతించడం లేదు. శుక్రవారం సాయంత్రం లోయర్ బ్రిడ్జి నీట మునిగిన విషయం తెలిసిందే. మూసీ ఉధృతితో బ్రిడ్జి పై 10 అడుగుల ఎత్తు నుంచి వరద ప్రవహించింది. కాగా, అప్పర్ బ్రిడ్జి పైనుంచి మాత్రమే వాహనాలను అనుమతిస్తుండటంతో చాదర్ ఘాట్ పరిసరాల్లో ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. కోఠి నుంచి చాదర్ ఘాట్ వరకు వాహనాలు నిలిచిపోయాయి.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు