హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స)
కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై ఈడీ దాడులు జరిగి సరిగ్గా ఏడాది గడిచినా, ఆ దాడుల్లో ఏం జరిగిందనే విషయం ఇప్పటికీ ఒక పెద్ద రహస్యమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ దాడుల తదనంతర పరిణామాలే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య అపవిత్ర బంధానికి నిదర్శనమని పేర్కొన్నారు. దాడుల సమయంలో మంత్రి ఇంట్లోకి రెండు కరెన్సీ నోట్ల లెక్కింపు యంత్రాలను తీసుకువెళ్లినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఏడాది గడిచినా ఈ విషయంలో ఈడీ గానీ, బీజేపీ గానీ, సంబంధిత కాంగ్రెస్ మంత్రి గానీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని చెప్పారు. దాడుల తర్వాత తదుపరి చర్యలు లేవు, కేసు నమోదు కాలేదు, కనీసం ప్రెస్ రిలీజ్ కూడా విడుదల చేయలేదన్నారు. ఇంతటి గొప్ప ఘనత సాధించి, విజయవంతంగా 'వాషింగ్ మెషిన్ని' (నల్లధనాన్ని తెల్లగా మార్చే కేంద్రాన్ని) నడుపుతున్నందుకు కేంద్ర మంత్రులు అమిత్ షాకు, నిర్మలా సీతారామను, వారి ఈడీ బృందానికి అభినందనలలు అంటూ కేటీఆర్ సెటైర్ వేశారు. బీజేపీ మరియు కాంగ్రెస్ మధ్య ఉన్న అపవిత్ర బంధానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు