న్యూఢిల్లీ, 5 సెప్టెంబర్ (హి.స.),: దేశ స్వయం సమృద్ధికి తోడ్పడే తదుపరి తరం సంస్కరణలు ఆగబోవని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. ‘వస్తు సేవల పన్ను (జీఎస్టీ) 2.0’ అనేది దేశ వృద్ధికి మద్దతుగా నిలిచే డబుల్ డోస్ అని పేర్కొన్నారు. ఈ సంస్కరణలతో మరింత వేగంగా ఆత్మనిర్భర భారత్ సాకారమవుతుందని ధీమా వ్యక్తంచేశారు. స్వదేశీ/ స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ‘మేక్ ఇన్ ఇండియా..వోకల్ ఫర్ లోకల్’ నినాదాలను సాకారం చేయాలని కోరారు. జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో గురువారం ఆయన ముచ్చటించారు. సామాజిక మాధ్యమాల్లోనూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దేశీయ ఉత్పత్తుల వినియోగంతో దేశ రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. పాఠశాలల్లో స్వదేశీ దినోత్సవం, స్వదేశీ వారోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జీఎస్టీలో సవరణలు పౌరుల జీవితాలను మెరుగుపరుస్తాయని చెప్పారు. ముఖ్యంగా చిరు వ్యాపారులు, రైతులు, మధ్యతరగతి, మహిళలు, యువతకు మేలు కలుగుతుందన్నారు. వంటగది వస్తువులు, వ్యవసాయ పనిముట్లు, ఆఖరికి ఔషధాలపైనా మునుపటి కాంగ్రెస్ సర్కారు అధికంగా పన్నులు విధించిందని విమర్శించారు. చిన్నారుల చాక్లెట్లనూ వదిలిపెట్టకుండా భారీగా పన్ను వసూలు చేసిందన్నారు. ఆ పాలన కొనసాగి ఉంటే ప్రతి రూ.100 కొనుగోలుపైనా రూ.20-25 పన్ను చెల్లించాల్సి వచ్చేదని చెప్పారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు