
చెన్నై,21 ,జనవరి (హి.స.) తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ 2023లో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే ). తాజాగా దీనిపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలు విద్వేషపూరిత ప్రసంగమేనని వ్యాఖ్యానించింది.
ఉదయనిధి వ్యాఖ్యలను విమర్శిస్తూ.. భాజపా నేత అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంపై దాఖలైన కేసును హైకోర్టు కొట్టేసింది. ఉదయనిధి 2023లో చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ.. మాలవీయ చేసిన పోస్టు నేరం కిందకు రాదని పేర్కొంది. సనాతన ధర్మాన్ని (Sanatana Dharma) అనుసరించేవారే లక్ష్యంగా చేసిన రెచ్చగొట్టే ప్రసంగానికి అది ప్రతిస్పందన మాత్రమేనని స్పష్టం చేసింది. ఉదయనిధి ఉపయోగించిన పదజాలంపై అసహనం వ్యక్తంచేస్తూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు విద్వేషపూరిత ప్రసంగం కిందకే వస్తాయని పేర్కొంది. తమిళనాడులో మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి కేసు నమోదు కాలేదని, ఇతర రాష్ట్రాల్లో కొన్ని కేసులు నమోదైన విషయాన్ని ప్రస్తావించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు