
అమరావతి, 22 జనవరి (హి.స.)
అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో రాష్ట్ర మంత్రి లోకేశ్ బుధవారం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, సమకూరుస్తున్న వసతులను వివరించారు. సుదీర్ఘ కోస్తా తీరం, పోర్టులు పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉంటాయని చెప్పారు. పోర్టులకు అనుసంధానంగా ఉండే ఏపీ పారిశ్రామిక నోడ్‌లలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. జెరా గ్లోబల్ సీఈవో యుకియా కానితో లోకేశ్ భేటీ అయ్యారు. గ్రీన్ అమ్మోనియా తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన్ను కోరారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, జపాన్, ఇతర ఆసియా మార్కెట్లకు లోకార్బన్ అమ్మోనియా సరఫరా చేయడానికి రాష్ట్రంలో మూలపేట, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని సమీపంలోని గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టాలని యుకియా కానికి లోకేశ్ సూచించారు. పారిశ్రామిక వినియోగదారులకు అవసరమైన క్లీన్ ఎనర్జీ కోసం రాయలసీమలో సౌర, పవన హైబ్రీడ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని కోరారు. పునరుత్పాదక ఇంధన వనరులు, లిక్విడ్ నైట్రోజన్, లోకార్బన్ అమ్మోనియా తయారీకి అనుకూలంగా ఏపీ ఉంటుందన్నారు. అమ్మోనియా యాంకర్ పరిశ్రమలకు ఏపీ అనువైనదన్నారు. థర్మల్ ప్లాంట్లలో అమ్మోనియా కోఫైరింగ్‌ను పరిశీలించడానికి పైలట్ ప్రాజెక్టును చేపట్టాలని సూచించారు. యుకియా కాని మాట్లాడుతూ.. భవిష్యత్తులో క్లీన్ ఇంధన దిగుమతులకు మద్దతు ఇవ్వడానికి భారత్‌లోని గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వాల్యూ చెయిన్‌లను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ