భారత్‌తో త్వరలోనే భారీ వాణిజ్య ఒప్పందం.. దావోస్ వేదికగా ట్రంప్ కీలక ప్రకటన
దావోస్‌, 22 జనవరి (హి.స.) స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ (Davos) వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్- 2026 సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన భారత్-అమెరికా మధ్య జరగబోయే వాణిజ్య ఒప్పందం, ప్ర
ట్రంప్


దావోస్‌, 22 జనవరి (హి.స.)

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ (Davos) వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్- 2026 సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన భారత్-అమెరికా మధ్య జరగబోయే వాణిజ్య ఒప్పందం, ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) నాయకత్వాన్ని ప్రశంసిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీపై తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. ఆయన తనకు మంచి స్నేహితుడు మాత్రమే కాదు, ఒక అద్భుతమైన నాయకుడని కితాబిచ్చారు. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు మోదీ నాయకత్వంలో మరింత బలోపేతం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం (Trade Deal) గురించి ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాము భారత్‌తో ఒక అద్భుతమైన ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నాం. దీనిపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని అన్నారు. ఈ ఒప్పందం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని కామెంట్ చేశారు.

వ్యూహాత్మక భాగస్వామ్యం..

ప్రపంచ దేశాలతో వాణిజ్యపరమైన సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్‌ను అమెరికా ఒక నమ్మకమైన మరియు వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోందని ట్రంప్ స్పష్టం చేశారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా ఈ కొత్త ఒప్పందం ఉండబోతోందని సమాచారం. కాగా, గతంలో కొన్ని సుంకాల (Tariffs) విషయంలో విభేదాలు వచ్చినప్పటికీ, ట్రంప్ తాజా వ్యాఖ్యలతో ఆ అడ్డంకులు తొలగిపోయి, త్వరలోనే చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande