
అమరావతి, 09 జనవరి (హి.స.)
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటిస్తున్నారు.. అయితే, స్థానిక అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు పవన్.. పిఠాపురం మున్సిపల్ కమిషనర్‌తో పాటు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, పిఠాపురం కమిషనర్ వ్యవహారశైలిని ఆయన తప్పుబట్టారు. కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, అపరిశుభ్ర పరిస్థితులను చూసి పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలు ఇంత చెత్తగా ఉంటే అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు ఎలా ఉంటాయి? నేను అయితే ఇలాంటి చోట ఒక్క రోజు కూడా ఉండలేను. అసలు నేను చీపురు పట్టి రోడ్లు తుడవాలా? అంటూ అధికారులను నిలదీశారు.
ఇక, పిఠాపురంలో పారిశుధ్య నిర్వహణ విఫలమవుతున్న నేపథ్యంలో.. ‘గుడ్ మార్నింగ్ పిఠాపురం’ కార్యక్రమాన్ని కూడా తానే స్వయంగా నిర్వహించాలా? అని పవన్ తీవ్రంగా ప్రశ్నించారు. ప్రజలకు కనీస సదుపాయాలు అందించడంలో మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. పిఠాపురం అభివృద్ధి కోసం పాడా (పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ) ప్రకటించినా, దాని అమలు విషయంలో వేగం లేకపోతే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. అవసరమైతే రాజకీయ-పరమైన అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాలు తీసుకోలేరా? అభివృద్ధి కోసం ప్రభుత్వం గట్టి అడుగులు వేయొద్దా? అని అధికార పార్టీ నేతలను, యంత్రాంగాన్ని నిలదీశారు.
కాలనీల్లో నడుచుకుంటూ సమస్యలు తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కేవలం సమీక్షలకే పరిమితం కాకుండా, పవన్ కల్యాణ్ పిఠాపురం కాలనీల్లో నడుచుకుంటూ వెళ్లి స్థానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, చెత్త నిర్వహణ, మౌలిక వసతుల కొరతపై ప్రజలు చెప్పిన అంశాలను ఆయన నోట్ చేసుకున్నారు. అయితే, పిఠాపురం పారిశుధ్య వ్యవస్థను వెంటనే మెరుగుపర్చాలని, అధికార యంత్రాంగం ప్రజల అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నిర్లక్ష్యం కొనసాగితే ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని హెచ్చరించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ