
అమరావతి , 02 అక్టోబర్ (హి.స.)గ్రామీణ గృహ నిర్మాణంలో కొత్త సాంకేతికతను పరీక్షించే కేంద్ర ప్రభుత్వ పైలట్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఎంపికైంది. 3D ప్రింటింగ్ టెక్నాలజీతో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించే ఈ ప్రాజెక్టులో భాగంగా బుర్రిపాలెం, ఒబులనాయుడుపాలెం ప్రాంతాల్లో మొత్తం 177 PMAY-G ఇళ్లను నిర్మించనున్నారు.
ఈ ప్రాజెక్టుకు పన్నులు మినహాయించి సుమారు రూ.13.93 కోట్ల వ్యయం అంచనా వేశారు. ఇందులో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూ.9.44 కోట్లను, రాష్ట్ర ప్రభుత్వం రూ.4.49 కోట్లను సమకూర్చనున్నాయి. నిర్మాణ పనులు సుమారు 18 నెలల కాలంలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు.
ప్రాజెక్టులో 100 ఇళ్లు 25 చదరపు మీటర్ల విస్తీర్ణంతో నిర్మించనుండగా, మరో 77 ఇళ్లు 32 చదరపు మీటర్ల విస్తీర్ణంతో, దివ్యాంగులకు అనుకూలంగా నిర్మించనున్నారు. ప్రతి ఇంటికి కుటుంబ అవసరాలకు అనుగుణంగా మరుగుదొడ్డి సదుపాయం కల్పించనున్నారు. 3D ప్రింటింగ్ నిర్మాణ సాంకేతికతలో కంప్యూటర్ ఆధారిత నమూనా ప్రకారం ప్రత్యేక యంత్రాలు నిర్మాణ పదార్థాన్ని పొరలుగా అమర్చి గోడలు, ఇతర నిర్మాణ భాగాలను వేగంగా రూపొందిస్తాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్