
హైదరాబాద్ , 21 అక్టోబర్ (హి.స.)తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కి చెందిన కస్టమర్ల ఖాతాలను టార్గెట్ చేస్తూ భారీ సైబర్ దాడికి పాల్పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని సుమారు 3,897 ఎస్బీఐ బ్యాంకు ఖాతాలపై ఈ మాల్వేర్ లేదా ఫిషింగ్ దాడి జరిగినట్లు అంతర్గత నివేదికలు వెల్లడించాయి. ఈ ఉదంతం బ్యాంకింగ్ రంగంతో పాటు సాధారణ ఖాతాదారులలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, సైబర్ నేరగాళ్లు నకిలీ లింకులు, ఏపీకే (APK) ఫైల్స్ మరియు రివార్డ్ పాయింట్ల పేరుతో కస్టమర్ల మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లు పంపినట్లు తెలుస్తోంది. ఆ లింకులను క్లిక్ చేసిన వినియోగదారుల బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీ (OTP) లు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లాయి.
దీనివల్ల కొందరి ఖాతాల నుండి పెద్ద మొత్తంలో డబ్బు మాయమైనట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగం (TG Cyber Security Bureau) ఎస్బీఐ సాంకేతిక బృందంతో కలిసి తక్షణమే రంగంలోకి దిగింది.
బాధిత ఖాతాలను గుర్తించి, వాటి నుంచి తదుపరి లావాదేవీలు జరగకుండా తాత్కాలికంగా బ్లాక్ చేశారు. హ్యాకర్లు ఏ ప్రాంతం నుండి ఈ దాడికి పాల్పడ్డారనే కోణంలో ఐపీ (IP) అడ్రస్‌లను ట్రాక్ చేస్తున్నారు. బ్యాంకు కస్టమర్లు ఎవరూ కూడా తమ వ్యక్తిగత పిన్ నంబర్లు, పాస్వర్డ్లు, ఓటీపీలను ఎవరికీ చెప్పవద్దని సైబర్ పోలీసులు హెచ్చరించారు. బ్యాంకులు ఎప్పుడూ ఫోన్లలో వివరాలు అడగవని గుర్తుంచుకోవాలన్నారు. అపరిచిత లింకులపై క్లిక్ చేయవద్దని, ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్