దుర్గా నిమజ్జన వేడుకలు – హైదరాబాద్లో మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
దసరా నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్ నగరంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలైన పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ (పివి నరసింహారావు మార్గ్) లలో భారీ ఎత్తున నిమజ్జన వేడుకలు జరగను
Devi NAVARATRI


హైదరాబాద్ , 21 అక్టోబర్ (హి.స.)దసరా నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్ నగరంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలైన పీపుల్స్ ప్లాజా, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ (పివి నరసింహారావు మార్గ్) లలో భారీ ఎత్తున నిమజ్జన వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం సుదీర్ఘమైన ఆంక్షలను విధిస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది.

ఈ ట్రాఫిక్ ఆంక్షలు బుధవారం (అక్టోబర్ 21) మధ్యాహ్నం 3:00 గంటల నుంచే అమలులోకి వచ్చాయి. ఇవి అక్టోబర్ 24వ తేదీ ఉదయం 6:00 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. నిమజ్జనానికి వచ్చే విగ్రహాల వాహనాలకు మాత్రమే ట్యాంక్ బండ్ పరిసరాల్లో అనుమతి ఉంటుంది. సాధారణ ప్రజల వాహనాలను, ఆర్టీసీ బస్సులను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఇక్బాల్ మినార్, సికింద్రాబాద్ వైపు వెళ్లే ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం.

ఈ మూడు రోజుల పాటు అత్యవసర పనులు ఉంటే తప్ప ట్యాంక్ బండ్ వైపు రావద్దని ఐటీ ఉద్యోగులకు, వాహనదారులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. గమ్యస్థానాలకు చేరుకోవడానికి గూగుల్ మ్యాప్స్ లేదా ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా అప్డేట్స్ను ఫాలో అవ్వాలని సూచించారు. విగ్రహాల ఊరేగింపు సాగే రూట్లలో సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం అదనపు బలగాలను, క్రేన్లను రంగంలోకి దించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని నగర ట్రాఫిక్ అడిషనల్ సీపీ హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande