
హైదరాబాద్ , 22 అక్టోబర్ (హి.స.)రాష్ట్రంలో వర్షాలు తగ్గిపోవడం, ఎల్‌నినో ప్రభావంపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి నిల్వలను పెంచేందుకు ఇంకుడు గుంతలు, రీచార్జ్ చెరువులు, చిన్న నీటి నిల్వ ప్రాంతాలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, పాత చెరువుల పునరుద్ధరణ, బోర్ల రీచార్జ్ వంటి పనులను చేపట్టనున్నట్లు ఆమె వెల్లడించారు.
వర్షాలు తక్కువగా కురిసినప్పుడు భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతుంది. వ్యవసాయానికి బోర్లపై ఆధారపడే రైతులతో పాటు తాగునీటి కోసం భూగర్భ జలాలను వినియోగించే గ్రామాలకూ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల వర్షపు నీటిని వీలైనంత ఎక్కువగా భూమిలోకి ఇంకేలా చేయడం, చెరువులు మరియు ఇతర నీటి వనరుల్లో నిల్వలను పెంచడం ముఖ్యమని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ పనుల్లో గ్రామ సర్పంచులు, స్థానిక ప్రజలు చురుగ్గా పాల్గొనాలని మంత్రి కోరారు. గ్రామస్థాయిలో నీటి అవసరాలను గుర్తించి, అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. తాగునీటి సరఫరాకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్