
హైదరాబాద్, 23 అక్టోబర్ (హి.స.)
తెలంగాణ గ్రేహౌండ్స్ విభాగానికి దేశవ్యాప్తంగా అద్భుతమైన పేరుందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు.
హైదరాబాద్ ఐసీసీసీ వేదికగా నేటి ఉదయం ప్రారంభమైన దక్షిణ ప్రాంతీయ పోలీసు సమన్వయ కమిటీ సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ సాధించిన విజయాలు, భద్రతాపరమైన ముందడుగులు, భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా వివరించారు.
తీవ్రవాద కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేకంగా 'ఆక్టోపస్' విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో హైదరాబాద్లో జరిగిన పలు పేలుళ్ల ఉదంతాలను గుర్తుచేస్తూ.. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా ప్రత్యేకంగా 'ఈగల్ ఫోర్స్'ను ఏర్పాటు చేసినట్టు డీజీపీ వెల్లడించారు.
డ్రగ్స్ కట్టడికి తెలంగాణ పోలీసులు చేసిన విశేష కృషిని గుర్తించి కేంద్ర హోంశాఖ కూడా అవార్డులు అందజేసిందని ఆయన గుర్తుచేశారు. పోలీసు సిబ్బంది వినియోగించే యాప్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ టెక్నాలజీని వాడుకుంటున్నామని, ముఖ్యంగా మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటూ రాష్ట్రంలో శాంతిభద్రతలను పటిష్టంగా కాపాడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ నేరాలను అణచివేయడానికి 'సైబర్ సెక్యూరిటీ బ్యూరో'ను ఏర్పాటు చేశామని డీజీపీ తెలిపారు. అంతేకాకుండా, రాష్ట్రంలో నక్సలిజం పూర్తిగా క్షీణించిందని, ఇటీవలే తెలంగాణ 'జీరో నక్సల్స్ స్టేట్'గా అవతరించిందని తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రకృతి విపత్తుల సమయంలోనూ సులకు సమర్థవంతమైన సేవలు సమయంలోనూ ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించినట్లు డీజీపీ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..