
హైదరాబాద్, 24 అక్టోబర్ (హి.స.) శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేడు భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. కౌలాలంపూర్ వెళ్లేందుకు సిద్ధమైన ఇద్దరు ప్రయాణికుల నుంచి సుమారు రూ.1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. ఎయిర్ ఏషియా విమానంలో కౌలాలంపూర్ వెళ్లేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడి బ్యాగును తనిఖీ చేయగా రూ.63.62 లక్షల విలువైన విదేశీ కరెన్సీ గుర్తించారు. అందులో 66,600 అమెరికన్ డాలర్లు, 3,773 మలేషియన్ రింగిట్లు, రెండు సింగపూర్ డాలర్లు ఉన్నట్లు గుర్తించారు. మహిళా ప్రయాణికురాలి వద్ద రూ.91.94 లక్షల డాలర్ల విలువైన విదేశీ కరెన్సీ లభించింది. ఆమె వద్ద 97,600 అమెరికన్ డాలర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించి సీజ్ చేశారు. మొత్తం లభించిన కరెన్సీ విలువ సుమారు రూ.1.56 కోట్లుగా ఉంది. ఈ వ్యవహారంలో ఇద్దరు ప్రయాణికులను అధికారులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ కేసులో మరో కీలక అంశాన్ని DRI అధికారులు గుర్తించారు. ఇద్దరు ప్రయాణికులు వేర్వేరు PNR నంబర్లతో టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ, ఒకే విమానంలో ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు గుర్తించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..