
అమరావతి , 29 అక్టోబర్ (హి.స.)
అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తొలగి, సాధారణ పరిస్థితులు పూర్తిగా నెలకొనే వరకు అధికారులు విశ్రాంతి తీసుకోకుండా పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలు వేగంగా చేపట్టాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, చేపట్టిన సహాయక చర్యలు, పునరుద్ధరణ పనుల పురోగతిపై కలెక్టర్లు, సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా సమస్యలు ఉన్నప్పటికీ, మిగిలిన తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు చాలావరకు సాధారణ స్థితికి చేరుకున్నాయని అధికారులు వివరించారు.
ప్రజలకు తాగునీరు, విద్యుత్ సరఫరా, రహదారి రవాణా వంటి అత్యవసర సేవల్లో అంతరాయాలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. నష్టపోయిన ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని, బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలన్నారు.
మరోవైపు, తుపాను కారణంగా జరిగిన నష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను బుధవారం అందజేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. నష్టం అంచనాలను సమగ్రంగా రూపొందించి, తదుపరి చర్యలకు అవసరమైన వివరాలను సిద్ధం చేయాలని సీఎం సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్