
అమరావతి , 03 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన గణాంకాలను ప్రభుత్వం వెల్లడించింది. సెప్టెంబర్ 15, 2026 నాటికి రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు రూ.15,229.40 కోట్ల రుణాలు పంపిణీ కాగా, మొత్తం బకాయి రుణ పోర్ట్ఫోలియో రూ.82,639.56 కోట్లుగా ఉన్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
వ్యవసాయం, పశుసంవర్ధక రంగం, చిన్న వ్యాపారాలు వంటి ఆదాయ ఆధారిత కార్యకలాపాలకు రుణాలను మళ్లించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్లు మంత్రి వివరించారు. స్వయం సహాయక సంఘాలకు అందే రుణాలు కేవలం తాత్కాలిక ఆర్థిక సహాయంగా కాకుండా కుటుంబ ఆదాయాన్ని పెంచే స్థిరమైన జీవనోపాధి కార్యకలాపాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
రుణాల ప్రక్రియలో డిజిటల్ విధానాలను కూడా ప్రవేశపెడుతున్నట్లు సమాచారం.
ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ, సభ్యుల గుర్తింపు పరిశీలన, రుణ వివరాల డిజిటల్ పర్యవేక్షణ వంటి చర్యల ద్వారా నకిలీ సభ్యత్వాలు లేదా నిధుల దుర్వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. బ్యాంకులు SHGల ప్రొఫైల్, గ్రేడింగ్, రుణ వివరాలను రియల్టైమ్ డ్యాష్బోర్డ్ల ద్వారా పర్యవేక్షించే విధానం కూడా ప్రతిపాదించారు.
రుణాలపై వడ్డీ రేట్లను 7 నుంచి 14.50 శాతం పరిధి నుంచి 7 నుంచి 11.70 శాతం పరిధికి తగ్గించినట్లు మంత్రి తెలిపారు. అలాగే SHGలకు పూచీకత్తు లేకుండా లభించే రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచినట్లు వివరించారు.
2026-27 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ వరకు రూ.19,655 కోట్ల లక్ష్యానికి గాను రూ.15,229 కోట్ల రుణాలు పంపిణీ అయ్యాయని, అంటే లక్ష్యంలో సుమారు 78 శాతం చేరుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ గణాంకాలు మహిళా సంఘాల బ్యాంకింగ్ అనుసంధానానికి సంబంధించిన ప్రస్తుత స్థితిని సూచిస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్