
హైదరాబాద్, 30 అక్టోబర్ (హి.స.)
ఆర్థిక వృద్ధి కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా ప్రతి కుటుంబం జీవితంలో సానుకూల మార్పు తీసుకురావాలని, ప్రజలకు మెరుగైన ఉపాధి, విద్య, వైద్యం, జీవన భద్రత కల్పించడమే నిజమైన అభివృద్ధి లక్ష్యమని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సంక్షేమం, ఆర్థిక క్రమశిక్షణ, పర్యావరణ పరిరక్షణ సమన్వయంతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. డాక్టర్ ఎం.సి.ఆర్. మానవ వనరుల అభివృద్ధి సంస్థ 50 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం నిర్వహించిన స్వర్ణోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆర్థిక వృద్ధి, సుస్థిర అభివృద్ధి, ప్రజా విధానాలపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేయడంలో అధికారులకు శిక్షణనిచ్చే సంస్థల పాత్ర కీలకమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు, నైపుణ్యాలు మెరుగుపడినప్పుడే ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతాయని పేర్కొన్నారు.
2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. సాంకేతిక పరిజ్ఞానం, లైఫ్ సైన్సెస్, ఆధునిక సేవారంగాల్లో హైదరాబాద్ సాధించిన ప్రగతి రాష్ట్రానికి గొప్ప అవకాశమని భట్టి విక్రమార్క అన్నారు. ఈ అభివృద్ధి హైదరాబాద్‌కే పరిమితం కాకుండా తయారీ రంగం, వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు విస్తరించాలని ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు