
అమరావతి , 07 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను, నిర్మాణ సంస్థలను ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో ప్రతి నెల రూ.2,000 కోట్ల విలువైన పనులు పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు.
అమరావతిలో కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు ఇచ్చారు. అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా ఆధునిక మౌలిక వసతులతో కూడిన అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా పనుల వేగాన్ని పెంచాలని నిర్ణయించారు.
ఇప్పటికే పెద్ద సంఖ్యలో నిర్మాణ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే పనులు నెమ్మదించడం, అనుమతులు, సమన్వయం వంటి కారణాలతో ఆలస్యం జరిగితే మొత్తం రాజధాని నిర్మాణ ప్రణాళికపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
సెప్టెంబర్ నెలలో సుమారు రూ.1,345 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్