
న్యూఢిల్లీ, 01 నవంబర్ (హి.స.)
ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహిస్తున్న ‘ఓట్ బచావ్.. దేశ్ బచావ్’ మెగా ర్యాలీ సందర్భంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రావణుడిని అంతం చేసేందుకు వానర సైన్యం ఏకమైనట్లుగా, ప్రధాని నరేంద్ర మోదీని అధికార పీఠం నుంచి దించేందుకు తామంతా ఒక్కటయ్యామని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. దేశంలో పేదలు, సామాన్య ప్రజల ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు.
రాంలీలా మైదానంలో జరిగే ర్యాలీ ద్వారా ఓట్ల చోరీ అంశంపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని వెల్లడించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 13.5 కోట్ల ఓట్లను తొలగించారని, భవిష్యత్తులో మరో 20 కోట్ల ఓట్లను తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మోదీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ర్యాలీకి ప్రజలు రాకుండా అడ్డుకునేందుకు రైళ్లను నిలిపివేసినా, వివిధ ఆంక్షలు విధించినా వాటిని అధిగమించి పెద్ద సంఖ్యలో ఢిల్లీకి చేరుకున్నారని తెలిపారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..