ఎస్ఈసీ చంద్రబాబు చెప్పుచేతల్లో పనిచేస్తోంది: వైఎస్ జగన్
పులివెందులలో చోటుచేసుకున్న పరిణామాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jagan


అమరావతి , 01 నవంబర్ (హి.స.)

పులివెందులలో చోటుచేసుకున్న పరిణామాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా పరిణామాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఎన్నికల ప్రక్రియలో స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో పనిచేస్తోందని ఆరోపించారు. ఎస్ఈసీతో పాటు ప్రభుత్వంలోని ఇతర వ్యవస్థలు కూడా చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలుగా మారాయని వ్యాఖ్యానించారు.

పులివెందులలో జరిగిన ఘటనలు ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ తెచ్చేలా ఉన్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే పరిస్థితులు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనలకు సంబంధించిన అంశాలపై న్యాయపోరాటం చేస్తామని, కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

పులివెందులలో ఓటు వేసేందుకు వచ్చిన వైఎస్ జగన్ అక్కడి పరిస్థితుల నేపథ్యంలో తన ఓటు హక్కును వినియోగించుకోకుండానే వెనుదిరిగారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ పరిణామాలను బయటపెడుతున్నామని ఆయన పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande