
అమరావతి , 11 నవంబర్ (హి.స.)కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశాఖపట్నం పర్యటన రద్దు అని సమాచారం. ఈ నెల 12, 13 తేదీల్లో విశాఖలో జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అయితే అనూహ్య కారణాలతో ఆయన పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది. ఈ సదస్సును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక అభివృద్ధి, కొత్త వ్యాపార అవకాశాల కల్పన లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. అమిత్ షా పర్యటన రద్దు కావడంతో ప్రారంభోత్సవ కార్యక్రమంలో మార్పులు ఉంటాయా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే ఆయన పర్యటన రద్దుకు గల కారణాలపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. మరోవైపు సదస్సు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్