
అమరావతి , 11 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్న 23 పట్టణ స్థానిక సంస్థలకు ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. గతంలో వివిధ కారణాలతో ఎన్నికలు నిలిచిపోగా, ముఖ్యంగా కోర్టుల్లో కొనసాగుతున్న వివాదాలు పరిష్కారం కావడంతో పోలింగ్ నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ నెల 13న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లతో పాటు మరో 19 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది కేటాయింపు, ఎన్నికల సామగ్రి సిద్ధం చేయడం వంటి అంశాలపై కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ అధికారికంగా ప్రకటించిన తర్వాత అభ్యర్థుల నామినేషన్లు, ప్రచారం తదితర ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రాజకీయ పార్టీల్లో ఎన్నికల సందడి మొదలయ్యే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్