
అమరావతి , 02 నవంబర్ (హి.స.)
మురసు తుపాను ప్రభావంతో భోగాపురం విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విమాన సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. తుపాను కారణంగా బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విమాన ప్రయాణాల నిర్వహణపై ప్రభావం పడింది.
ఈ పరిస్థితుల దృష్ట్యా భోగాపురంలోని ఏఎస్ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలను తాత్కాలికంగా రద్దు చేశారు. ముఖ్యంగా విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ నగరాలకు వెళ్లాల్సిన విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాలకు ప్రయాణించేందుకు ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తుపాను తీవ్రత, వాతావరణ పరిస్థితులను బట్టి విమాన సర్వీసుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమానాల రాకపోకలకు సంబంధించిన తాజా వివరాలను ఎయిర్లైన్స్ అధికారిక వెబ్సైట్లు లేదా మొబైల్ యాప్ల ద్వారా తెలుసుకోవాలని సూచించారు. విమాన సమయాల్లో మార్పులు, రద్దులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రయాణికులకు సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్