
మహబూబ్నగర్, 05 నవంబర్ (హి.స.)
కేటరింగ్ బిల్లులు ప్రాసెస్ చేసి, చెక్కులు విడుదల చేయడానికి రూ.1,00,000 లంచం డిమాండ్ చేసిన మహబూబ్నగర్ జిల్లా యువజన, క్రీడల అధికారి (DYSO), ఒక కంప్యూటర్ ఆపరేటర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు.
గురువారం జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు.
కేటరింగ్ పనులకు సంబంధించిన బిల్లులను క్లియర్ చేసి, చెక్కులు ఇవ్వడానికి మహబూబ్నగర్ జిల్లా యువజన, క్రీడల అధికారి జె. రాజశేఖర్ రెడ్డి , కంప్యూటర్ ఆపరేటర్ జి. ఉమేష్ లక్ష రూపాయిలు ఇవ్వాలని బాధితుడిని వేధించారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలో అధికారులు పక్కా వ్యూహంతో దాడి చేశారు. గురువారం కార్యాలయంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.1,00,000 లంచం తీసుకుంటుండగా రాజశేఖర్ రెడ్డి, ఉమేష్లను ఏసీబీ బృందం రెడ్హ్యాండెడ్గా పట్టుకొని అదుపులోకి తీసుకుంది.
ఈ ఘటనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, తదుపరి విచారణ జరుపుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు