
హైదరాబాద్ , 05 నవంబర్ (హి.స.)
సంగారెడ్డి జిల్లాలోని కంది సమీపంలో ఉన్న ప్యూర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీకి సంబంధించిన యూనిట్లో ప్రారంభమైన మంటలు క్రమంగా విస్తరించి భారీగా ఎగసిపడ్డాయి. దీంతో పరిశ్రమ పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది.
ప్రమాదాన్ని గుర్తించిన పరిశ్రమ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేపట్టారు. మంటలు ఇతర విభాగాలకు వ్యాపించకుండా సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.
ఈ ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర కారణాలతో మంటలు చెలరేగాయా అనే కోణంలో పరిశీలన జరగాల్సి ఉంది. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఎలాంటి ఆస్తి నష్టం సంభవించిందనే వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్