
హైదరాబాద్ , 05 నవంబర్ (హి.స.)
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య అంతర్గత అవగాహన కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న రాజకీయ ఒప్పందం కారణంగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు మాటలకే పరిమితమవుతున్నాయని వ్యాఖ్యానించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రతిసారీ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ముఖ్యంగా ఆర్ఆర్ ట్యాక్స్ అంశాన్ని ప్రస్తావిస్తారని కేటీఆర్ అన్నారు. అయితే, బహిరంగ సభల్లో ఆరోపణలు చేయడం తప్ప, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. నిజంగా రాష్ట్రంలో అవినీతి జరుగుతోందని బీజేపీ భావిస్తే, కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు, ఆచరణలో తీసుకుంటున్న చర్యలకు పొంతన లేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రెండు పార్టీల మధ్య ఉన్న లోపాయికారీ సంబంధాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలని, రాజకీయ విమర్శలతో కాలయాపన చేయకుండా అవినీతి ఆరోపణలపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్