
అనంతపురం జిల్లా, 05 నవంబర్ (హి.స.)
అనంతపురం జిల్లాలో ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోయారు. కూడేరు మండలం కాడదారకుంటలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఏపీవోగా విధులు నిర్వర్తిస్తున్న హరితగౌడ్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
హరితగౌడ్ను మెరుగైన వైద్యం అందించేందుకు కూడేరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మరణించారు. ఆస్పత్రికి చేరుకునేలోపే పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచినట్లు సమాచారం. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న ఎన్నికల సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
మృతురాలు హరితగౌడ్ రాయదుర్గం మండలంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా ఆమెకు ఏపీవో బాధ్యతలు అప్పగించారు. విధులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆమె మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్