
హైదరాబాద్ , 05 నవంబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. అధికారిక సమావేశానికి ముందు మంత్రులతో అనధికారికంగా కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది.
నిజామాబాద్, నల్గొండ, వరంగల్, కరీంనగర్ నగరాల్లో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు సమావేశంలో ప్రస్తావనకు రానున్నాయి. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఎదురయ్యే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేపట్టాల్సిన తదుపరి చర్యలపైనా చర్చించనున్నారు. అలాగే ల్యాండ్ సీలింగ్ చట్టం, సాదాబైనామాల క్రమబద్ధీకరణకు సంబంధించి కొత్త దరఖాస్తుల స్వీకరణ అంశంపై మంత్రివర్గం సమాలోచనలు జరపనుంది.
ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు మార్గం సుగమం చేసేలా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చట్టంలో సవరణలకు ఆమోదం తెలిపే అవకాశముంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం, పోలీస్ స్టేషన్లకు భూముల కేటాయింపు వంటి అంశాలు కూడా ఎజెండాలో ఉండనున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి కొత్త పోస్టుల మంజూరుపైనా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా చేయూత పింఛన్లకు సంబంధించి నూతన మార్గదర్శకాలను ఖరారు చేసే అంశంపై కూడా నిర్ణయం వెలువడవచ్చని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్