
అమరావతి , 05 నవంబర్ (హి.స.)
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఈ వ్యవహారంపై కొనసాగుతున్న న్యాయపరమైన చర్చకు ప్రాధాన్యత ఏర్పడింది.
ప్రైవేటు డెయిరీ పరిశ్రమకు చెందిన ఎండీ మశ్చీంద్ర శాంతారామ్ ఈ మేరకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్లో కేసు విచారణ కొనసాగితే నిష్పక్షపాతంగా దర్యాప్తు, విచారణ జరిగే అంశంపై సందేహాలు ఉన్నాయనే ఉద్దేశంతో కేసును రాష్ట్రం వెలుపలకు మార్చాలని ఆయన తన పిటిషన్లో కోరినట్లు తెలుస్తోంది. అయితే ఈ అభ్యర్థనను పరిశీలించిన ధర్మాసనం వ్యాజ్యాన్ని కొట్టివేసింది.
సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో లడ్డూ కల్తీ కేసు విచారణను ఏపీలోనే కొనసాగించేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయంగా, సామాజికంగా తీవ్ర చర్చకు దారితీసింది. తిరుమల శ్రీవారి ప్రసాదం నాణ్యత, తయారీలో ఉపయోగించిన ముడిసరుకులపై భక్తుల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్