
కలకత్తా, 21 మే (హి.స.)
బంగ్లాదేశ్తో అంతర్జాతీయ సరిహద్దు కంచె, భద్రతా మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)కు భూమిని అప్పగించారు బంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి. ప్రాథమికంగా 27కి.మీ మేర సరిహద్దు ప్రాంతానికి సంబంధించిన భూమిని అందజేశారు. ఇది ఇక్కడితో ఆగదని, రాష్ట్రంలో సరిహద్దు నిర్వహణను మరింత బలోపేతం చేయడానికి ఎక్కడ అవసరమైతే అక్కడ మరింత భూమిని కేటాయిస్తామని చెప్పారు. బీఎస్ఎఫ్ భూ బదిలీ సమావేశంలో మాట్లాడిన సీఎం సువేందు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర సరిహద్దు భద్రతను మెరుగుపరిచేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం కేవలం ప్రారంభం మాత్రమేనని అన్నారు.
ఈ సందర్భంగా, ఇంతకుముందు బంగాల్లో అధికారం చెలాయించిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్పై సీఎం సువేందు అధికారి విమర్శలు గుప్పించారు. వారు ఓటు బ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు విధానాలతో సరిహద్దు మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించలేదని విమర్శించారు. పైగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకించిందన్నారు.
గత ప్రభుత్వం తన ఓటు బ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు విధానాల కారణంగా బీఎస్ఎఫ్నకు భూమి ఇవ్వలేదు. అంతేకాదు గత కొన్ని సంవత్సరాలుగా సరిహద్దు ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులు, బీఎస్ఎఫ్ దళాలకు, పాలనా యంత్రాంగం మధ్య సమన్వయ సమావేశాలు జరగలేదు. దీనితో వీరి మధ్య సమన్వయం బలహీనపడింది. అందుకే ఇప్పుడు జిల్లా స్థాయి సమన్వయ యంత్రాంగాన్ని మళ్లీ పునరుద్ధరించాం. ఇకపై ఇవి క్రమం తప్పకుండా జరుగుతాయి అని ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi