తెలంగాణలో మందుబాబులకు షాక్.. జూన్ 2 తర్వాత బాదుడు!
తెలంగాణలో మందుబాబులకు షాక్.. జూన్ 2 తర్వాత బాదుడు!
తెలంగాణలో మందుబాబులకు షాక్.. జూన్ 2 తర్వాత బాదుడు!


హైదరాబాద్, 21 మే (హి.స.)

తెలంగాణలో మద్యం ప్రియులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో త్వరలోనే అన్ని రకాల మద్యం, బీర్ల ధరలు పెరగనున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 తర్వాత ధరల పెంపుపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర ఖజానాకు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

గత కొంతకాలంగా మద్యం తయారీ కంపెనీల నుంచి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. ముడిసరుకుల ధరలు, ముఖ్యంగా సీసాల తయారీ ఖర్చు పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. పశ్చిమాసియా యుద్ధం, కమర్షియల్ గ్యాస్ ధరలు రెట్టింపు కావడం వంటి కారణాలతో సీసాల తయారీ వ్యయం 15 నుంచి 20 శాతం వరకు పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ధరలను సవరించాలని కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

మద్యం ధరల పెంపు, ఆదాయ వనరులపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం గతంలోనే ఓ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, పొరుగు రాష్ట్రాల్లోని ధరలను విశ్లేషించిన ఈ కమిటీ రాష్ట్రంలో 25 నుంచి 30 శాతం వరకు ధరలు పెంచవచ్చని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఒకేసారి ఇంత భారీగా పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనతో ప్రభుత్వం సుమారు 10 నుంచి 15 శాతం మేరకే పెంపునకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

ఈ పెంపు నిర్ణయం అమలైతే సాధారణ, మీడియం బ్రాండ్లతో పాటు ప్రీమియం బ్రాండ్ల ధరలు కూడా పెరగనున్నాయి. పెరిగిన ధరల ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం లభించనుండగా, మద్యం ప్రియులపై మాత్రం భారం పడనుంది. ఆర్థిక, అబ్కారీ శాఖలు దీనికి సంబంధించిన కసరత్తును ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande