
చెన్నై, 07 మే (హి.స.)
అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కకపోవడంతో తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ ఉత్కంఠ నెలకొన్నది. ఈ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఏకంగా 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తి మెజారిటీకి మరో 10 మంది ఎమ్మెల్యేలు అవసరం. తన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజయ్ ఇప్పటికే రెండుసార్లు గవర్నర్ను కలిసి కోరినా.. ఆయన 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానని చెబుతున్నారు.దాంతో ఫలితాలు వెలువడి మూడు రోజులు అవుతున్నా ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని బీజేపీ చెబుతోంది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే టీవీకే 108 స్థానాలనే గెలుచుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 మంది ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు ప్రకటించడంతో ఆ సంఖ్య 113కు చేరింది. అయితే విజయ్ రెండు చోట్ల గెలువడంతో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. కాబట్టి విజయ్ బలపర్చే ఎమ్మెల్యేల సంఖ్య 112. మరో ఆరుగురికి మద్దతు కోసం టీవీకే సంప్రతింపులు జరుపుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi