ఆయిల్ పామ్ సాగు అన్ని విధాలుగా శ్రేయస్కరం : నిజామాబాద్ జిల్లా కలెక్టర్
ఆయిల్ పామ్ సాగు అన్ని విధాలుగా శ్రేయస్కరం : నిజామాబాద్ జిల్లా కలెక్టర్
Collector


నిజామాబాద్, 07 జూలై (హి.స.)

అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్ పామ్ పంట సాగు చేసేందుకు జిల్లాలోని ఆదర్శ రైతులు చొరవ చూపాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. మాక్లూర్ మండలం చిన్నాపూర్ రైతు వేదికలో ఆయిల్ పామ్ సాగు పై మంగళవారం స్థానిక రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, సంప్రదాయ వరి పంట స్థానంలో ఆయిల్ పామ్ సాగు చేపడితే కలిగే ప్రయోజనాల గురించి అధికారులు రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ సాగు చేపట్టి దిగుబడులు పొందుతున్న ఆదర్శ రైతులు జైడి మధుసూదన్, లక్ష్మణ్, గడ్డం గంగారెడ్డి, సుధాకర్ తదితరులు తమ స్వీయ అనుభవాలను తోటి రైతులకు తెలియజేశారు. ప్రభుత్వ సబ్సిడీతో తాము ఆయిల్ పామ్ పంట సాగు చేశామని, ప్రస్తుతం మంచి దిగుబడి చేతికి వచ్చిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అంతర పంట సాగు ద్వారా అదనపు ఆదాయాన్ని సైతం ఆర్జించడం జరిగిందని వివరించారు. డ్రిప్ ఏర్పాటు కోసం 90 శాతం సబ్సిడీతో ప్రభుత్వమే డ్రిప్ పరికరాలను సమకూర్చిందని అన్నారు.

తాము సహచర ఆదర్శ రైతులు కలిసి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట, సత్తుపల్లి ప్రాంతాలకు వెళ్లి ముందుగా ఆయిల్ పామ్ సాగును అధ్యయనం చేశామని, ఏ రకంగా చూసినా ఈ పంట అధిక లాభాలు అందిస్తుందని గమనించి తాము కూడా ఆయిల్ పామ్ సాగు చేశామన్నారు. వరి, పసుపు వంటి పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ సాగు ఎంతో శ్రేయస్కరం అని నిరూపితం అయ్యిందని రైతులు తమ స్వీయ అనుభవాన్ని తోటి రైతులతో పంచుకున్నారు. బైబ్యాక్ ఒప్పందాన్ని అనుసరిస్తూ, ప్రీ-యూనిక్ కంపెనీ వారు మద్దతు ధర చెల్లిస్తూ కలెక్షన్ సెంటర్ల ద్వారా ఆయిల్ పామ్ పంట దిగుబడిని సేకరిస్తున్నారని అన్నారు.

ఈ పంట సాగుకు జిల్లాలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని, పంట సాగుకు అవసరమైన ఆయిల్ పామ్ మొక్కలు నర్సరీలో అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ సీజన్ లో 1600 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ పంట సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా, రైతుల ప్రయోజనార్ధం కనీసం 2 వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ పంట సాగును ప్రోత్సహించాలని నిర్ణయించామని అన్నారు. స్థానికంగా జిల్లాలోనే ఆయిల్ పామ్ ఫాక్టరీ కూడా ఏర్పాటు కానుందని, ఇప్పటికే ఆయిల్ పామ్ దిగుబడుల సేకరణ కోసం కలెక్షన్ సెంటర్లను అందుబాటులో ఉంచామని గుర్తు చేశారు. వరి సాగు వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, ప్రధానంగా కూలీల కొరతతో అవస్థలకు గురి కావాల్సి వచ్చిందని అన్నారు. అంతేకాకుండా ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు ఎంతో శ్రేయస్కరమని ఈ పంట ప్రయోజనాల గురించి ప్రతి రైతు అవగాహన కల్పించుకుని నూతనత్వం కోసం, ప్రయోగాత్మక పద్దతిలో అయినా సాగుకు ముందుకు రావాలని సూచించారు. వంట నూనె తయారీతో పాటు ఇతర అనేక ఉత్పత్తుల్లో వినియోగించే ఆయిల్ పామ్ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు.

ఆయిల్ పామ్ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తే, రైతులు అధిక లాభాలు ఆర్జించవచ్చని, ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలను అందిస్తోందని వివరించారు. ఈ పంట సాగు చేస్తున్న రైతులకు ఎకరాకు సాలీనా 4200 రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాల పాటు ఇన్ పుట్ సబ్సిడీని రైతు ఖాతాలో జమ చేస్తోందని తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ యూనిట్ ను 90 శాతం సబ్సిడీతో మంజూరు చేస్తోందని, ఆయిల్ పామ్ మొక్కలపై కూడా సబ్సిడీని అందిస్తోందని అన్నారు. ఆయిల్ పామ్ బోర్డు ఉన్నందున పంట అమ్మకం, మద్దతు ధర విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన పని లేదన్నారు. మొక్కలు అందించిన కంపెనీలే, బోర్డు ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు పంటను కొనుగోలు చేస్తాయని తెలిపారు. ఎకరం విస్తీర్ణంలో సుమారు పది టన్నుల వరకు దిగుబడి వస్తుందని, అంతర పంట వేసుకొని అదనపు లాభాలను పొందవచ్చని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ పంటకు ఉన్న డిమాండ్ ను బట్టి చూస్తే ఎకరానికి కనీసం రూ. లక్షన్నర నుండి రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం ఆర్జించే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

ఒక్కసారి ఆయిల్ పామ్ సాగు చేపడితే, కనీసం ముప్పై సంవత్సరాల పాటు ఈ పంట ద్వారా గణనీయమైన ఆదాయం పొందవచ్చని సూచించారు. ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చే రైతులకు జిల్లా యంత్రాంగం తరఫున అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ఆయిల్ పామ్ పంట సాగుకు ఉపయోగపడే ఆధునిక పరికరాలను సబ్సిడీ పై అందించేలా చొరవ చూపుతామని అన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఆయిల్ పామ్ సాగుకు ఆసక్తిని కనబరుస్తూ, అవగాహన సదస్సులో కలెక్టర్ సమక్షంలోనే డీ.డీలు చెల్లించేందుకు ముందుకు రాగా, కలెక్టర్ వారిని అభినందించారు. అదేవిధంగా ఆయిల్ పామ్ సాగు ద్వారా ఆదర్శంగా నిలుస్తున్న బాశెట్టి గంగాధర్, రాహుల్ రాజ్, బాశెట్టి లక్ష్మణ్ తదితర రైతులను ఘనంగా సన్మానించారు. ఆయిల్ పామ్ పంట దిగుబడులతో కూడిన ఉత్పత్తులు, అధునాతన వ్యవసాయ పరికరాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను రైతులకు కలిసి సందర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande