
హైదరాబాద్, 06 ఆగస్టు (హి.స.) బోనాల ఉత్సవాల సందర్భంగా మహిళల భద్రత కోసం షీటీమ్స్ ప్రత్యేక నిఘా చేపట్టాయి. ఉత్సవాల్లో భాగంగా దేవాలయాల వద్ద మహిళలను కొందరు వ్యక్తులు వేధింపులకు గురిచేశారు. మహిళల ఫిర్యాదు ఆధారంగా షీటీమ్స్ రంగంలోకి దిగారు. మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, వేధింపులకు గురిచేసిన 678 మంది ఈవ్టీజర్లను గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్, వీడియో ఆధారాలతో నిందితులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. విచారణ అనంతరం ఆకతాయిలను కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం పలువురికి శిక్షలు విధించింది.
25 మందికి జైలు శిక్షతోపాటు జరిమానాలను కోర్టు విధించింది. అలాగే 11 మందికి 3 రోజుల జైలు శిక్షతో పాటు రూ.1,050 జరిమానా విధించింది. మరో 26 మందికి రూ.1,050 చొప్పున జరిమానాతో పాటు సామాజిక సేవ చేయాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మహిళల భద్రతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్