
హైదరాబాద్, 06 ఆగస్టు (హి.స.) దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కృత్రిమమేధ(ఏఐ) ఆధారిత జనరేషన్ డయల్ 112 సేవలను తెలంగాణ పోలీసులు ప్రారంభించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ పోలీసు శాఖ నెక్స్ట్ జనరేషన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (టీజీ- ఈఆర్ఎస్ఎస్) డయల్ 112ను అందుబాటులోకి తెచ్చింది. పోలీస్, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళా భద్రత,
బాలల రక్షణ, ప్రకృతి విపత్తుల నిర్వహణ సేవలన్నీ ఒకే జాతీయ నంబరు కిందకు తీసుకొచ్చారు. ఈ అత్యవసర సేవల విభాగాన్ని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డీజీపీ మాట్లాడారు. డయల్ 112 ప్రారంభం వ్యక్తిగతంగా తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. దీన్ని కొంపల్లి ప్రాంగణం నుంచి ఇక్కడకు మార్చేందుకు దాదాపు నాలుగేళ్లుగా ఎంతో ప్రయత్నం చేశామన్నారు. ఏఐని ఉపయోగించుకొని డయల్ 112 సేవలు వేగవంతంగా అందించడాన్ని అభినందించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆయన... పోలీసు ఉన్నతాధికారులతో కలసి డయల్ 112, ‘సురక్షా కా తిరంగా’ పోస్టర్లను ఆవిష్కరించారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖాగోయల్, టెక్నికల్ సర్వీసెస్ డీజీపీ వి.వి.శ్రీనివాసరావు, నగర సీపీ సజ్జనర్, సైబరాబాద్ సీపీ రమేశ్, మల్కాజిగిరి సీపీ సుమతి, కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి, అగ్నిమాపకశాఖ డీజీ విక్రమ్సింగ్మాన్, సీఐడీ డీజీ చారుసిన్హా, లా అండ్ ఆర్డర్ డీజీ మహేశ్భగవత్, ఐజీ చంద్రశేఖర్రెడ్డి తదితర పోలీసు ఉన్నతాధికారులతో కలసి డయల్ 112 సేవలను డీజీపీ ఆనంద్ పరిశీలించారు. ప్రకృతి విపత్తులు, ట్రాఫిక్ సమస్యలు, అగ్నిప్రమాదాల వంటి అత్యవసర సమయంలో పోలీసులు చేరటానికి ముందుగానే అక్కడ పరిస్థితిని అంచనా వేసి దిశానిర్దేశం చేసేందుకు డ్రోన్లను వినియోగిస్తామని కమలాసన్రెడ్డి డీజీపీ ఆనంద్కు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్