
హైదరాబాద్, 11 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు పార్టీ కార్యకర్తల్లో సేవా భావాన్ని పెంపొందించడమే ఈ అభియాన్ ప్రధాన ఉద్దేశమని రాంచందర్రావు చెప్పారు.
ఈ మేరకు సెప్టెంబర్ 17న ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఇంటిలో దీపాలు వెలిగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిచ్చారు. నెల రోజుల పాటు రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.
పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి, ముద్ర రుణాల ద్వారా చేతివృత్తిదారులు, చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని రాంచందర్రావు తెలిపారు. ఈ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు. అభియాన్లో భాగంగా మేరే సప్నో కా భారత్, సేవా కీ కహానీ, సేవా జ్యోతి కలశ్ యాత్ర, సుశాసన్ సేవా సంవాద్ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. సేవ, సుశాసనం, ప్రజా సంక్షేమం అనే స్ఫూర్తితో మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే లక్ష్యమని రాంచందర్రావు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్