మూసీ ప్రాజెక్టుకు NGTలో ఎదురుదెబ్బ.. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ
తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు మళ్లీ న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి.
Musi river


హైదరాబాద్, 11 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు మళ్లీ న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ తాజాగా రిటైర్డ్ ఇంజినీర్లు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దక్షిణాది బెంచ్ ను ఆశ్రయించారు. ఈ అప్పీల్పై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే, మూసీ ప్రక్షాళన పేరుతో చేపడుతున్న పనులకు పర్యావరణ నిబంధనలు, అనుమతులు పూర్తి లోపభుయిష్టంగా ఉన్నాయి పిటిషనర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతం మొత్తం 55 కి.మీ ఉంటే.. కేవలం 20 కి.మీ మేర మాత్రమే స్టడీ చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా ఇదే రీజియన్లో మృగవాణి నేషనల్ పార్క్ కూడా ఉందని పేర్కొన్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సమీపంలో భారీ నిర్మాణాలు చేపట్టాలన్న నిర్ణయంతో పాటు వాణిజ్య సముదాయాల ఏర్పాటుపైనా రిటైర్డ్ ఇంజినీర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే, పిటిషనర్ల అప్పీల్ను పరిశీలించిన చెన్నై ఎన్జీటీ బెంచ్.. ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పర్యావరణ అనుమతుల జారీ, ప్రాజెక్టు అమలుకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం తన వాదనలను, సంబంధిత వివరాలను ట్రిబ్యునల్కు వెంటనే అందజేయాలని పేర్కొన్నది. మూసీ ప్రాజెక్టుపై గతంలోనూ ఎన్జీటీలో న్యాయపరమైన వివాదం కొనసాగింది. ఈ ఏడాది ఏప్రిల్లో మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును సవాల్ చేస్తూ దాఖలైన ఓ పిటిషన్ను ఎన్జీటీ కొట్టివేయగా తాజా పిటిషన్తో మరోసారి ప్రభుత్వానికి నోటీసులు రావడం ప్రధాన్యతను సంతరించుకుంది.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande