

-
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించిన భారతీయ భాషల ప్రవాహం, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచింది
-
భారతీయ జ్ఞాన సంప్రదాయం, ప్రాంతీయ భాషలు, సమృద్ధి భారత్ అనే ప్రధానాంశంతో 'భారతీయ భాషా సమాగమ్-2026' వారణాసి (కాశీ) వేదికగా ఘనంగా జరిగింది.
వారణాసిలో ఆదివారం జరిగిన ఈ సదస్సులో భారతీయ భాషల శక్తి సామర్థ్యాలను భవిష్యత్ భారతావణి ఆకాంక్షలకు అనుసంధానించడంపై విస్తృత చర్చ జరిగింది. మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్ ప్రాంగణంలోని గాంధీ అధ్యయాన పీఠ్ సభాభవన్‌లో 'హిందుస్థాన్ సమాచార్' వార్తా సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ప్రముఖుల సమక్షంలో ఘన ప్రారంభం
ఈ సదస్సును హిమాచల్ ప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కుల్దీప్ చంద్ అగ్నిహోత్రి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార టోలీ సభ్యులు ముకుల్ కాణిత్కర్, సార్నాథ్ కేంద్రీయ ఉచ్ఛ శిక్షా సంస్థాన్ వైస్ ఛాన్సలర్ భిక్షు ప్రొ. వంగచుగ్ దోర్జే నేగి, రాష్ట్ర సమాచార కమిషనర్ పదుమినారాయణ్ ద్వివేది, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మాజీ మంత్రి డాక్టర్ నీలకంఠ తివారీ తదితరులు జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. 'హిందుస్థాన్ సమాచార్' సమూహ అధ్యక్షుడు అరవింద్ భాల్‌చంద్ర మార్డికర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో, ప్రాంతీయ సంపాదకుడు డాక్టర్ రాజేష్ తివారీ అతిరథ మహారథులకు స్వాగతం పలికారు.
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒకే జ్ఞాన కుటుంబం
భారతీయ భాషలు కేవలం సంభాషణకు మాత్రమే పరిమితం కాలేదు; అవి వేల సంవత్సరాల నాటి జ్ఞానాన్ని, తత్త్వాన్ని, విజ్ఞానాన్ని, సాహిత్యాన్ని, కళలను భావితరాలకు అందిస్తున్న వారధులు. స్థానిక భాషల్లో నిక్షిప్తమై ఉన్న ఈ విజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికత, డిజిటల్ వేదికలు, పరిశోధనలతో అనుసంధానించడం ద్వారా దేశం అద్భుతమైన జ్ఞాన నెట్‌వర్క్‌ను సృష్టించవచ్చని సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు.
వారసత్వం నుండి జ్ఞానం - జ్ఞానం నుండి నూతన ఆవిష్కరణలు
భారతీయ భాషలలోని సాహిత్యం, జానపద జ్ఞానం, జీవన అనుభవాలు కేవలం సాంస్కృతిక నిధులు మాత్రమే కావు. ఇవి ఆధునిక పరిశోధనలకు, నూతన ఆవిష్కరణలకు అపారమైన అవకాశాలను అందిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ), ఆధునిక అనువాద పద్ధతులు, డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించి ప్రాంతీయ భాషల పరిజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తం చేయవచ్చని నిపుణులు నొక్కిచెప్పారు.
గ్లోబల్ నాలెడ్జ్ ఎకానమీలో భారత్ పాత్ర
21వ శతాబ్దపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మేధస్సు, ప్రతిభ, నూతన ఆవిష్కరణలే అత్యంత కీలకం. భారతదేశంలోని యువత ప్రతిభతో పాటు బహుభాషా సంపద దేశానికి అతిపెద్ద బలం. వికసిత భారత్ (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్య సాధనలో ఈ భాషా వైవిధ్యాన్ని సాంకేతికతతో, ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించడం ద్వారా భారత్ ప్రపంచానికి దిశానిర్దేశం చేయగలదని ఈ సమాగమ్ ద్వారా స్పష్టమైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi