
తిరుపతి, 18 సెప్టెంబర్ (హి.స.) ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్చల్ చేసిన ఘటన రేణిగుంట రైల్వే స్టేషన్లో ఇవాాళ ఉదయం చోటుచేసుకుంది.
రైలు పైకి ఎక్కి హైటెన్షన్ విద్యుత్ వైర్ను పట్టుకునేందుకు యత్నించడం తీవ్ర కలకలం రేపింది. రైల్వే సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
రేణిగుంట రైల్వే స్టేషన్లో ఉదయం 5 గంటల నుంచి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానంటూ భయభ్రాంతులకు గురిచేశాడు. ప్లాట్ఫాం ఫుట్పాత్ బ్రిడ్జిపై వేలాడుతూ హల్చల్ చేశాడు. దీంతో అక్కడున్న వారు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తి చేసిన ఈ వీరంగంతో స్టేషన్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన రైల్వే అధికారులు తక్షణమే స్పందించారు. ప్రమాదం జరగకుండా హైటెన్షన్ విద్యుత్ లైన్ పవర్ సప్లైని ఆఫ్ చేసి ఆ వ్యక్తిని కాపాడారు. ఈ సందర్భంగా తిరుపతి నుంచి రేణిగుంట జంక్షన్ మీదుగా చెన్నై, హైదరాబాద్ , విజయవాడ వైపు వెళ్లాల్సిన రైళ్ల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు.
పరిస్థితి తీవ్రతను గమనించిన అగ్నిమాపక శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. రైల్వే ట్రాక్వ పై ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సదరు వ్యక్తి అస్సాం రాష్ట్రానికి చెందిన వాడిగా గుర్తించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV