
భూపాలపల్లి, 26 సెప్టెంబర్ (హి.స.)
డబుల్ బెడ్ రూమ్ లలో మున్సిపల్ అధికారులు నిర్వహిస్తున్న సర్వే పై జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక దృష్టి సారించారు.
డోర్ లాక్ పేరుతో కొందరు మున్సిపల్ అధికారులు లబ్ధిదారుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణల విషయం భూపాలపల్లిలో చర్చనీయాంశమైంది.
దీనిపై స్పందించిన కలెక్టర్ డోర్ లాక్ వసూళ్ల దందాపై ఆరా తీశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అమ్ముకుంటున్నారని, అద్దెకు ఇస్తున్నారని, ఆక్రమించుకుంటున్నారనే ఆరోపణలపై మున్సిపల్ అధికారులు గతంలో సర్వే నిర్వహించారు.
అయితే ఇండ్లలో నివాసం ఉంటూ ఇతర పనులకు వెళ్లిన వారి ఇండ్లకు డోర్ లాక్ అని నమోదు చేశారు. వాటిని ఇతరులకు కేటాయిస్తామని అధికారులు చెబుతుండడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.
ఈ క్రమంలో ఇటీవల వారం రోజులుగా మున్సిపల్ అధికారులు మళ్లీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో తిరుగుతూ ఇంటి నెంబర్లు ఇచ్చేందుకు సర్వే ప్రారంభించారు. గతంలో డోర్ లాక్ అని నమోదు చేసిన ఇండ్ల వైపు కన్నెత్తి చూడకుండా మిగతా ఇండ్లకు ఇంటి నెంబర్లు ఇచ్చే ప్రక్రియ చేపడుతుండడంతో బాధితులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..