నిమ్స్ డాక్టర్ అక్రమాస్తుల కేసులో కలకలం.. ఉద్యోగుల ఇళ్లలో ఏసీబీ సోదాలు, బార్బర్ వద్ద రూ.7 లక్షలు స్వాధీనం
డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్ ఆదాయానికి మించిన ఆస్తుల (DA) కేసు దర్యాప్తు వేగవంతమైంది.
Acb


హైదరాబాద్ , 29 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నిమ్స్ (NIMS) అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్ ఆదాయానికి మించిన ఆస్తుల (DA) కేసు దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసుకు సంబంధించి యాంటీ కరెప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు దర్యాప్తును మరింత విస్తృతం చేస్తూ మంగళవారం ఉదయం నుంచి మెరుపు దాడులు నిర్వహించారు. డాక్టర్తో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయన్న అనుమానాలతో నిమ్స్ ఆసుపత్రికి చెందిన కొందరి ఉద్యోగుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా నిమ్స్ ఆసుపత్రిలో బార్బర్గా పనిచేస్తున్న ధన్రాజ్ నివాసంలో ఏసీబీ అధికారులు భారీగా నగదును గుర్తించారు. ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో లెక్కలో లేని రూ. 7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కేవలం బార్బర్గానే కాకుండా మరికొంతమంది సిబ్బంది ఇళ్లలో కూడా ఏకకాలంలో ఈ తనిఖీలు కొనసాగాయి.

మనీ ట్రైల్పై ఏసీబీ ప్రత్యేక దృష్టి..డాక్టర్ లక్ష్మీ భాస్కర్ గతంలో కూడబెట్టిన అక్రమాస్తులు, బినామీ పేర్లతో చేసిన పెట్టుబడులపై ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న నిమ్స్ ఉద్యోగుల పాత్రపై ఆరా తీస్తున్నారు. బార్బర్ ధన్రాజ్ వద్ద లభించిన రూ. 7 లక్షల నగదు ఎక్కడి నుంచి వచ్చింది? డాక్టర్తో ఈ ఆర్థిక లావాదేవీల నేపథ్యం ఏమిటి? అనే కోణంలో అధికారులు లోతుగా విచారిస్తున్నారు. అలాగే, సోదాలు నిర్వహించిన ఐదు ప్రాంతాల్లోనూ భూముల కొనుగోలుకు సంబంధించిన కీలక పత్రాలు, మనీ ట్రైల్కు తగిన ఆధారాలను అధికారులు సేకరిస్తున్నారు. త్వరలోనే డాక్టర్ లక్ష్మీ భాస్కర్ను కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని, ఈ దర్యాప్తు పూర్తికావడంతో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉందని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande