
హైదరాబాద్ , 29 సెప్టెంబర్ (హి.స.)సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ రేస్ నిర్వహణ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్తో పాటు మరో ముగ్గురు నిందితుల పాస్పోర్టులను స్వాధీనం చేసుకోవాలని (ఇంపౌండ్ చేయాలని) యాంటీ కరెప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఫార్ములా-ఈ రేస్ ఒప్పందాలు మరియు నిధుల బదిలీ ప్రక్రియలో నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఏసీబీ గతంలోనే చార్జ్షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ దశలో ఉండగా, విదేశీ ప్రయాణాలకు అవకాశం లేకుండా నిందితుల పాస్పోర్టులను జప్తు చేయాలని కోరుతూ దర్యాప్తు సంస్థ కోర్టును కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, కేటీఆర్ పాస్పోర్టు జప్తు అయినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. ఏసీబీ అధికారులు కేవలం కోర్టులో పిటిషన్ మాత్రమే దాఖలు చేశారని, ఇప్పటివరకు న్యాయస్థానం నుంచి ఎలాంటి జప్తు ఉత్తర్వులు వెలువడలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై లీగల్ టీమ్తో చర్చించి తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్