
అస్సాం, 03 సెప్టెంబర్ (హి.స.) పోలీస్ అవుట్పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న ఒక పోలీస్ తన సహచరులపై కాల్పులు జరిపాడు. తీవ్ర బుల్లెట్ గాయాలైన ఇద్దరు పోలీసులు మరణించారు.
కాల్పుల్లో చనిపోయిన వారిలో ఒకరు ఆ పోలీస్ అవుట్పోస్ట్ ఇన్ఛార్జ్ అని సమాచారం. సహచరులపై కాల్పులు జరిపిన ఆ పోలీస్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కామరూప్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అస్సాం-మేఘాలయ సరిహద్దులోని ఒక పోలీస్ అవుటోపోస్ట్ వద్ద విధుల్లో ఉన్న ఒక పోలీస్ గురువారం తెల్లవారుజామున తోటి పోలీసులపై కాల్పులు జరిపాడు.
బోకో పోలీస్ స్టేషన్ పరిధిలోని గమేరిముర పోలీస్ అవుటోపోస్ట్ వద్ద ఉదయం 4 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. ఏకే 47 సర్వీస్ రైఫిల్తో జరిపిన ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే మరణించారు.
కాగా, సహచర పోలీస్ కాల్పుల్లో మరణించిన వారిని ఇంద్రజిత్ బోరా, ఫజ్రుల్ అలీగా గుర్తించారు. గమేరిముర పోలీస్ అవుటో పోస్ట్ ఇన్ఛార్జ్ అధికారిగా ఇంద్రజిత్ వ్యవహరిస్తుండగా, హవల్దార్ హోదాలో అలీ ఉన్నారు. 29వ అస్సాం పోలీస్ బెటాలియన్కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ చిరంజీబ్ చౌదరి వారిపై కాల్పులు జరిపినట్లు సమాచారం.
మరోవైపు సీనియర్ పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీస్ కానిస్టేబుల్ చిరంజీబ్ చౌదరిని అదుపులోకి తీసుకున్నారు. తన సహచరులపై అతడు ఎందుకు కాల్పులు జరిపాడో అన్నది దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు