
న్యూఢిల్లీ, 03 సెప్టెంబర్ (హి.స.) లా విద్యార్థులకు భారీ ఉపశమనం కలిగిస్తూ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
చదువుకుంటున్న లా విద్యార్థులపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకునే చట్టబద్ధమైన అధికారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు గానీ, రాష్ట్ర బార్ కౌన్సిల్స్కు గానీ లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
హైదరాబాద్లోని నల్సార్ లా యూనివర్సిటీ కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ సంచలన తీర్పును వెలువరించింది. ఒక లా గ్రాడ్యుయేట్ అడ్వకేట్గా నమోదు (ఎన్రోల్) అయిన తర్వాతే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం బార్ కౌన్సిల్కు ఉంటుందని, విద్యార్థి దశలో ఉన్నప్పుడు వారిపై చర్యలు తీసుకునే అధికారం కేవలం వారు చదువుతున్న విద్యాసంస్థకు లేదా దాని నియమావళి ప్రకారం నిర్ణయించబడిన ప్రాధికార సంస్థకు మాత్రమే ఉంటుందని ధర్మాసనం తేల్చిచెప్పింది.
ఈ సందర్భంగా బిసిఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ఆగస్టు 13న జారీ చేసిన ఆదేశాలు పూర్తిగా చట్టవిరుద్ధమని కోర్టు ప్రకటించింది. నల్సార్ యూనివర్సిటీకి చెందిన 2026 బ్యాచ్ విద్యార్థుల ఎన్రోల్మెంట్ను నిలిపివేయాలని, అలాగే సిజెఐకి వ్యతిరేకంగా నిరసన తెలపడంలో భాగస్వాములైన విద్యార్థులు, అధ్యాపకులపై విచారణ జరిపించాలని బిసిఐ ఛైర్మన్ గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. అయితే తీవ్ర నిరసనలు వ్యక్తమవ్వడంతో గంట వ్యవధిలోనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకుని, విద్యార్థులకు క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికీ, బిసిఐ ఛైర్మన్ ఏ చట్టబద్ధ అధికారం కింద ఈ ఆదేశాలు ఇచ్చారో తేలాల్సి ఉందంటూ నల్సార్ పూర్వ విద్యార్థులు మిహిర సూద్, అభిషేక్ తివారీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్ కె. పరమేశ్వర్ వాదనలు వినిపించారు.
ఉత్తర్వులను ఉపసంహరించుకున్నందున వ్యవహారం ముగిసిందని బిసిఐ తరఫున మనన్ కుమార్ మిశ్రా తెలిపినప్పటికీ, సీజేఐ సూర్య కాంత్ పిటిషనర్ల వాదనతో ఏకీభవించారు. విద్యార్థుల నిరసన తెలిపే హక్కును సమర్థిస్తూ, విద్యార్థులు మరియు సీజేఐకి మధ్య ఉన్న వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం బిసిఐకి ఏముందని గతంలోనే హెచ్చరించిన అత్యున్నత న్యాయస్థానం, తాజాగా ఆ ఉత్తర్వులన్నీ చట్టవిరుద్ధమని కొట్టివేస్తూ పిటిషన్ను ముగించింది. అంతేకాకుండా విద్యార్థులు, ఉపాధ్యాయులపై బిసిఐ లేదా రాష్ట్ర బార్ కౌన్సిల్స్ ఎలాంటి శిక్షాత్మక చర్యలు తీసుకోకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణ ఉత్తర్వులను శాశ్వతం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..